మెట్రో మూడో కారిడార్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 7వ తేదిన ప్రారంభించనున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోరైలు కారిడార్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ర్ట పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు సమీక్షించారు. ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహాన్ లతో పాటు హైదరాబాద్ మెట్రోరైల్,  జీహెచ్ఎంసీ, పురపాలక శాఖాధికారులు, నగర పోలీస్ కమీషనర్, ఎల్ అండ్ టి ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరోజు జరిగే కార్యక్రమంలో కారిడార్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో పాటు, నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమయిన చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులను మంత్రి అదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్ షిప్ (పిపిపి) మెట్రోరైల్ ప్రాజెక్ట్ అని దీని నిర్మాణంలో అందుకున్న మైలురాళ్లు, అవార్డుల వంటి అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. మూడో కారిడార్ ప్రారంభంతో దేశంలోనే హైదారాబాద్ మెట్రో రైల్ రెండవ అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ గా అవతరిస్తుందన్నారు.